21, సెప్టెంబర్ 2010, మంగళవారం

మీ సమస్యలు..నా సలహాలు


"ఆరోగ్యమే మహాభాగ్యం"....ఈ సూక్తిని ఏదో ఊరికే నేర్చుకున్నా, నా అనుభవంలోకి వచ్చాకే అది బాగా అర్థమవుతోంది......ఇన్నాళ్ళ నా వైద్యుడి జీవితం నాకు ఆ సూక్తికి అసలు రూపాన్ని చూపించింది....ఇప్పుడు ఏ పేషెంటుని చూసినా అదే ప్రతిక్షణం మనసుకి తగులుతూ ఉంటుంది...... డాక్టర్ గా కాక, ఒక మామూలు వ్యక్తిగా ఫీల్ అయ్యి, ఒక పేషెంటుగానో, లేక అటెండెంట్ గానో ఉన్నప్పుడు ఈ విషయం ఇంకా బాగా అర్థమవుతోంది....

ఎంతోమందిని చూస్తుంటాను! కొత్తవాళ్ళైనా, "డాక్టర్ని" అని చెప్పగానే, వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళబోసుకుంటుంటారు....సరైన గైడెన్స్ లేక వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడిందీ,పడుతుందీ చెప్తుంటారు...... నా సన్నిహితులు,బంధువులు ఎప్పుడు వాళ్ళకి ఏ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా, ఫోన్ చేసి అడుగుతుంటే, "వీళ్ళకైతే నేను చెబుతున్నాను! మిగతా వాళ్ళంతా ఎలానో కదా!" అని అనిపించేది...బ్లాగు సోదరి గారు "యాంటీబయాటిక్స్" గురించి అనుమానం అడిగినప్పుడు ఆ ఆలోచన మరింత బలపడింది.....ఈ మధ్య నాకు ఎదురైన కొన్ని అనుభవాలు ఆ ఆలోచనని మరికాస్త ముందుకు నెట్టాయి...అందరికీ ఈ దిశగా కొంత ఉపయోగపడాలన్న నా ఆలోచనలకి కార్యరూపమే ఈ బ్లాగు......

పైగా ఈ కాలపు డాక్టర్లన్నా,వాళ్ళ వైద్యమన్నా ఎవరికీ సరిగ్గా నమ్మకం ఉండట్లేదు,మన మీడియా ప్రభావమేమో!....."డబ్బులకోసమే అంతా చేస్తుంటారు,ఇన్ని టెస్టులు ఎందుకు చేస్తారో అర్థంకాదు" అనుకుంటుంటారు.....దానికి కొంత వరకి మా డాక్ట్రర్లే కారణం....పేషెంట్ కి అర్థమయ్యే రీతిలో చెప్పలేక పోవటం ఒక కారణమైతే, రెండవది అందుకు సరైన సమయాన్ని కేటాయించలేక పోవడం......అందరికీ సాధారణంగా వచ్చే ఈ అనుమానాలకి ఎలా సమాధానం ఇవ్వాలా అనుకుంటున్నపుడు నాకు తట్టిన ఆలోచనే ఈ నా"వైద్యశాస్త్రం"......
పైగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకి డాక్టర్ దగ్గరికి పరిగెట్టి గంటలు గంటలు వెయిట్ చేసి,చివరికి ఓ పెద్ద మందులచీటీ చేత్తో పట్టుకుని రావాలంటే మధ్యతరగతివాళ్ళకి అన్నిరకాలుగా భారమైన పని....అలా అని పూర్తిగా లైట్ తీసుకున్నా ప్రమాదమే....కాబట్టి దానిక్కావాల్సింది సరైన గైడెన్స్ అనిపించింది.....అందుకే ఈ "వైద్యశాస్త్రం" తో మీ ముందుకు వస్తున్నాను........

మీకు ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలున్నా నాకు మెయిల్ చెయ్యండి.....మీ సమస్యలకి నా సలహాలని ఈ బ్లాగు ముఖంగా తెలియజేస్తాను..అది మిగతావారిక్కూడా ఉపయోగకరంగా ఉంటుంది.........ఇంకో ముఖ్యమైన విషయం....ఇక్కడ మీ సమస్యలకి సలహాలని మాత్రమే చెప్పి, మీకు సరైన గైడెన్స్ ఇవ్వటం మాత్రమే ముఖ్య ఉద్దేశ్యం...అంతేకాని, డైరెక్ట్ గా ఎలాంటి వైద్యమూ చెప్పటం జరగదని మనవి......

నా మెయిల్ ఐడీ :- choudary.koutilya90@gmail.com

ధన్యవాదాలు21 వ్యాఖ్యలు:

 1. మీ బ్లాగ్ ఉద్దేశ్యం చాలా బాగుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఆ విశ్వనాథ కౌటిల్యుడు భాగవతంతో, మనుచరిత్రతో మానసిక ఉల్లాస సూత్రాలు చెబితే.. ఈ వైద్య కౌటిల్యుడు శరీర ఆరోగ్య సుత్రాలు చెబుతారన్న మాట. మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి ఏ కొద్దిగా అయినా ఉపయోగపడాలనే మీ తపనకు అభినందన శుభాశ్శీస్సులు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. >పైగా ఈ కాలపు డాక్టర్లన్నా,వాళ్ళ వైద్యమన్నా ఎవరికీ సరిగ్గా నమ్మకం ఉండట్లేదు,మన మీడియా ప్రభావమేమో

  ఈ విషయంలో మీడియా ప్రభావం అతి తక్కువ అని నా అభిప్రాయం. డాక్టర్ల దోపిడీలు నా అతి చిన్న పరిథిలోనే నాకు చాలా సార్లు ఎదురయ్యాయి. నేను చెప్పేది కార్పొరేట్ హాస్పిటల్స్ మాత్రమే కాదు, MBBS మాత్రమే చదివి చిన్న ఊళ్ళలో ప్రాక్టీసు చేసుకునేవాళ్ళ విషయంలో కూడా. దీనికి కారణాల గురించి చర్చించడం కూడా అనవసరం; ఎవరికి తెలియవు కనక!
  ----

  మీరు చేస్తున్నది చాలా మంచి పని. ఓపిగ్గా కొనసాగిస్తే ఇది చాలామందికి ఉపయోగపడడమే కాక మీకు చాలా ఆత్మ సంతృప్తిని కూడా ఇస్తుందనడంలో నాకు సందేహం లేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. డాట్రారూ, గుర్తుందా, మనం పుస్తకాల పండగలో మొదట అంతా కలుసుకున్నపుడు మీరు బ్లాగు మొదలెడితే ఇదే పేరు పెట్టాలని మేమంతా తీర్మానించేశాం? అదే పేరు పెట్టేశారా? బాంది బాంది!ఫీజేమీ పుచ్చుకోరు కదా సలహాలకు? :-))

  ప్రత్యుత్తరంతొలగించు
 5. అలా అయితే కుదరదండీ
  స్పాట్ ఫిక్సింగ్ లో జరిగినంత పెర్ఫెక్ట్ గా రిజల్ట్స్ రావాలి

  మంచి ఆలోచన బ్లాగర్లకు ఆరోగ్య ప్రాప్తిరస్తు

  ప్రత్యుత్తరంతొలగించు
 6. చాలామంచి పని. అప్పుడప్పుడూ మాకు వైద్యపరమైన సందేహాలు వస్తున్నప్పుడు ఎవరిని అడగాలో తెలియక సతమతమవుతూ ఉంటాం. ఆస్పత్రికి వెళ్ళాలంటే ఇంత చిన్న విషయానికి ఎంత ఫీజు గుంజుతారో అని భయం. మీరు మాకు మంచి సలహాలు ఇవ్వగలరని ఆశిస్తున్నాను.

  @సుజాత గారూ
  పుస్తకాల పండగ ఏమిటండీ....పేరు వినడానికే చాలా బావుంది. వివరాలు చెప్పరూ? డాక్టరుగారు చెప్పినా సరే.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. కౌటిల్య గారు చాలా మంచి ఆలోచనండీ ఇలా సహాయం చేయాలన్న మీఆలోచనకు ధన్యవాదాలు/అభినందనలు, అందరికీ ఉపయోగపడే సమాచారం కోసం ఎదురు చూస్తున్నాను.

  @ఆ.సౌమ్య గారు సుజాతగారు చెప్పింది హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ గురించి అనుకుంటానండీ. కానీ తెలుగులో వింటే ఎంత బాగుందో కదా :-)

  @నాగమురళి గారు, "డాక్టర్ల దోపిడీలు నా అతి చిన్న పరిథిలోనే నాకు చాలా సార్లు ఎదురయ్యాయి." ఒకోసారి పూర్తిగా అవగాహన లేక అవసరమైన టెస్ట్ లనుకూడా దోపిడీ అనుకునే అవకాశాలు లేకపోలేదండి. మీకెదురైన అనుభవాలు డాక్టర్ గారికి చెప్తే బహుశా తను వాటి వెనుక ఉన్న ఆవశ్యకతను వివరించగలరేమో.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. అయ్యబాబోయ్ బాబోయ్ నేనే ఫస్ట్ నేనేఫస్ట్ ...పోస్ట్ చూడగానే కామెంట్ ఖర్చీఫ్ వేద్దాం అంటే ఏదోపని పడి మర్చిపోయాను..డాక్టర్ గారు నేను ఉన్నా సందేహాలు అడిగే లిస్ట్లో ..నన్ను ప్రక్కకు తోసేయకండేం

  ప్రత్యుత్తరంతొలగించు
 9. @రామకృష్ణ గారు,
  మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు..

  @ రాజన్ గారు,
  ఏదో నాకున్న కొద్దిపాటి జ్ఞానాన్నైనా అందరికీ ఉపయోగపెట్టాలన్నదే నా తపన..మీ ఆశీస్సులకి నా మంగిడీలు..

  @mmd,
  థాంక్యూ అండీ..
  @హరీష్,
  థాంక్స్ అబ్బాయ్!
  @ బిందు గారు,
  నాది ఇది కొత్తబ్లాగే కాని,నేను తెలుగు బ్లాగ్లోకానికి కొత్తకాదండీ..ఓ పది నెలల్నుంచీ ఉన్నా! అయినా మీ స్వాగతానికి ధన్యవాదాలు..

  ప్రత్యుత్తరంతొలగించు
 10. @ నాగమురళి గారు,
  దోపిడీ అనేది కొంతవరకు నిజమే!కాని, కింద వేణూ గారు చెప్పినట్టు అవగాహనా రాహిత్యం వల్ల కొన్ని సార్లు పొరపాటు పడే అవకాశం ఉందండీ...మీ ప్రోత్సాహం ఉంటే, రెట్టింపు ఓపికతో కొనసాగిస్తానండీ...మీడియా గురించి మనం పర్సనల్ గా మాటాడుకుందాం..ఇక్కడ మొదలెడితే బాగోదేమో! :-)

  @సుజాత గారు,
  అది గుర్తుండబట్టే పెట్టానండీ!టైటిల్ మీద పేటెంట్ హక్కులు మీవి,మురళీవే..)) ఫీజు ఏమీ పుచ్చుకోమండీ! మీరు ఏమన్నా పెద్ద మనసుతో విరాళాలిస్తే పుచ్చుకుంటాం(e-తెలుగు నీళ్ళు బాగా వంటబట్టాయి మరి)..ః)))

  ప్రత్యుత్తరంతొలగించు
 11. @హరేకృష్ణ గారు,
  >అలా అయితే కుదరదండీ
  స్పాట్ ఫిక్సింగ్ లో జరిగినంత పెర్ఫెక్ట్ గా రిజల్ట్స్ రావాలి

  ఇక్కడ ఏది కుదరదో అర్థం కాలేదండీ! స్పాట్, రిజల్టు అన్నారు,అదీ అర్థమవలా!:-(....

  తెలుగు బ్లాగర్లకే కాదండీ,రీడర్లకి కూడా..:-)

  @ సౌమ్యగారు,
  తప్పకుండా! మీరు అడగడమే తరువాయి....పుస్తకాల పండగంటే హైద్రాబాద్ బుక్ ఫెస్టివల్ అండీ! అప్పుడే బ్లాగు ప్రపంచంతో నాకు పరిచయం.....that one week is my most memorable one..సుజాత గారు, మురళి అంతా కలిసి నన్ను ప్రోత్సహించి నాతో బ్లాగు మొదలెట్టించారు...ఈ బ్లాగు టైటిల్ వారు సూచించిందే!

  ప్రత్యుత్తరంతొలగించు
 12. @ వేణూశ్రీకాంత్ గారు,
  ధన్యవాదాలు..మంచి సమాచారాన్ని అందించటానికి తప్పకుండా ప్రయత్నిస్తాను..

  @నేస్తం జీ,
  మరి ఖర్చీఫు వేసుకోకపోతే ప్లేసు పోతుంది మరి!ః))..మిమ్మల్ని ఎప్పుడో లిస్టులో వేసుకున్నాం..ః)))

  ప్రత్యుత్తరంతొలగించు
 13. వేణూశ్రీకాంత్/కౌటిల్య గారూ,

  మా స్నేహితుల్లో కొంతమంది డాక్టర్లున్నారు (కౌటిల్యగారితో కలిపి :-) ). కాబట్టి ఒక్కోసారి అనుకోకుండా వాళ్లతో మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు తెలిసి షాకవుతూ ఉంటాం. ఉదాహరణకి - ఖరీదైన ఒక ఇంజక్షన్ మా నాన్నగారికి ఒకతను రాశాడు. మా నాన్నగారి స్నేహితుడైన మరొక డాక్టరొకాయన ఆ ప్రిస్కిప్షన్ చూసి, ఏమనుకోకండి, ఇది ప్లాసిబో, మీరు చేయించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

  అలాగే ముక్కు ఒకసారి పరిక్ష చేయించుకుందామని వెళ్తే, నాకు CT scan చేయించాడు డాక్టరు. తర్వాత నా ఫ్రెండు ఒక ENT తో మాట్లాడితే, ఈమాత్రం దానికి CT Scan చేయించారా అని ఆశ్చర్యపోయాడు. ఇటువంటివే మరికొన్ని అనుభవాలు :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 14. మురళి గారు చెప్పినది విన్నాక, నాకు మా ఇంట్లో జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది.

  మా నాన్నగారు షుగర్ పేషెంటు. ఒకరోజు సాయంత్రం నుండి గుండెలో ఏదో పెట్టేసినట్టుగా ఉంది అంటూ ఉన్నారు. సమయానికి మా కుటుంబ వైద్యుడు అందుబాటులో లేకపోవడం వల్ల వెంటనే పక్కనే ఉన్న డాక్టర్ (MD) దగ్గరకి తీసుకుని వెళ్ళాం. అతని పరీక్షలు చేసి గేస్ వల్ల అలా పట్టేసినట్టున్నాదండీ, ఏమీ సమస్య లేదు అని గేస్ట్రిక్ ట్రబుల్ కి మదులిచ్చి ఇంటికి పంపేసాడు. మందులు వేసుకున్నా కూడా మర్నాడు అప్పుడప్పుడూ అలాగే పట్టేసినట్టు ఉంది అన్నారు. ఆ మరుసటి రోజు మా కుటుంబ వైద్యుడు ఊరిలోకొచ్చేరని తెలిసి ఎందుకైనా మంచిదని ఆయన్ని కలవడానికి మా నాన్నగారు ఒక్కరే వెళ్ళారు. ఆయనేమో మా నాన్నకి ఏమీ చెప్పకుండా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి పంపిచేసారు. ఆ తరువాత మాకు ఫోన్ చేసి ఆయనకి హార్ట్ ఎటాక్ వచ్చింది అర్జెంట్ గా వైజాగ్ తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. మాది విజయనగరంలెండి. అప్పటికప్పుడు మేము ప్రయాణం కట్టి వైజాగ్ లో పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్ళాం. ఆస్పత్రికి వెళ్ళగానే పెద్ద హార్ట్ ఎటాక్ వచ్చి మా నాన్నగారు కుప్పకూలిపోయారు. వైద్యులు పరీక్ష చేసి అప్పటికే రెండు సార్లు మైల్డ్ అటాక్ వచ్చిందని చెప్పి, అశ్రద్ధ చేసినందుకు మమ్మల్ని చెడామడా తిట్టారు. ఇప్పుడు వచ్చిన అటాక్ కి తట్టుకోగలిగితే మా నాన్నగారికి ఫరవాలేదని చెప్పారు. 24 గంటల్ టైం ఇచ్చారు. మా అదృష్టాలు బావుండి మా నాన్నగారు కోలుకున్నారు. ఆ మొదట వెళ్ళిన డాక్టరు మీద కేసు వేద్దామనుకున్నాం. కానీ ఆ ఖర్చులన్నీ తూగే తాహతు లేక వదిలేసాం. అప్పటి నుండీ నాకు డాక్టర్లంటే కాస్త అనుమానము, భయమూ పెరిగాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. @ నాగమురళి గారు, సౌమ్య గారు,
  మీకు ఎదురైన అనుభవాలన్నీ చూస్తుంటే,నాకు ఒక విషయం బాగా అర్థమైంది...ఇలాంటివి మేం కూడా వింటూంటాం....దీనికి ముఖ్య కారణం...సబ్జెక్ట్ మీద సరైన గ్రిప్ లేకపోవడం,క్లినికల్ ఎక్స్పీరియన్స్ సరిగ్గాలేక వ్యాధిని సరిగ్గా గుర్తించలేక పోవటం(హార్ట్ ఎటాక్ విషయంలో)...పైగా ఫాలో అవ్వవలసిన ప్రోటోకాల్స్ సరిగా ఫాలో అవ్వకపోవటం(ఇది ముఖ్యంగా మురళిగారి సీటీ స్కాన్ విషయంలో)...ఇలాంటి అనుభవాలు మీకు ఎదురు కాకూడదనే, మీకు సరైన గైడెన్స్ ఇద్దామనే ఈ నా చిన్న ప్రయత్నం....

  ప్రత్యుత్తరంతొలగించు
 16. సంతోషం. ఎక్స్‌పర్టుల నుండి సలహాలు, సూచనలు ఇచ్చే బ్లాగులు వచ్చే బ్లాగులు రావాలని కోరుకున్నాను.

  మధ్యమధ్య ఇండియాకి వెళ్ళి కొద్దిరోజులే వున్నప్పటికీ చాలామంది డాక్టర్లు, లాబ్ టెక్నీషియన్లు గట్రా వీలయినంతవరకు దోచుకుంటారని నాకు/మాకు జరిగిన కొన్ని అనుభవాల వల్ల అర్ధమయ్యింది. అలా అంటే ఎవరు దోచుకోవట్లేదు లెండి? మనకు అవకాశం లేక కానీ వుంటే మనమూ ఏదో విధంగా సమర్ధించుకొని చేస్తామేమో. దోపిడీ అన్నది ఇండియాలో కనీస ప్రమాణయ్యింది. నిజాయితీగా వుంటే ఇంట్లో ఆడవారే చేతకాని దద్దమ్మ అని ఈసడిస్తారు. మరి ముఖ్యమంత్రుల్లాంటి వారే వందల, వేల కోట్లు వెనకేస్తుంటే మనం కొన్ని కోట్లయినా ఏదోవిధంగా వెనకెయ్యడానికి సిగ్గుపడతామా, వెనకాడుతామా?

  సర్లెండి. ఆ టాపిక్ వదిలేద్దాం. మీ నుండి చక్కటి సలహాలు, సూచనలు ఆశిస్తున్నాం. ఈమెయిల్లోనే కాకుండా సరాసరి ఇలా మీ బ్లాగులో కూడా సందేహాలు అడగవచ్చా? మీ బ్లాగు పేరు చూసి మీరెవరో ఆయుర్వేదం మీద సలహాలు ఇస్తారేమో అనుకొని ముందు ఆసక్తి చూపలేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 17. Too busy a schedule and dealing with high volume of patients is part of the problem.
  In US, restrictions from health insurance companies, HMOs etc play a role.

  ప్రత్యుత్తరంతొలగించు
 18. @శరత్ గారు,
  నా టైటిల్,ప్రొఫైల్ చూసి ఆయుర్వేదం అనుకున్నారా!....సందేహాలు మెయిల్ చేస్తేనే మంచిదండీ...ఎందుకంటే నేను బ్లాగు తరచుగా చూడను..అందువల్ల త్వరగా రెస్పాండ్ కాకపోవచ్చు..మెయిల్ మాత్రం ఎప్పుడూ చూస్తూనే ఉంటా! పైగా పేషెంట్ ప్రైవసీ ముఖ్యం కదా!ఇక్కడ అంత కంఫర్టబుల్ గా సమస్యని చెప్పలేకపోవచ్చు...

  @తెరెసా గారు,
  మీరు చెప్పిన కారణాల పాత్ర ఖచ్చితంగా ఉంటుందండీ!

  ప్రత్యుత్తరంతొలగించు