27, సెప్టెంబర్ 2010, సోమవారం

నేను ముందు చూసిన "పా"; "PROGERIA" A RARE GENETICAL DISORDER


"పా"! చాలా రోజుల్నుంచి చూద్దాం అనుకుంటుంటే ఇవ్వాళ్టికి కుదిరింది.....అన్ని పాత్రల నటనా చాలా టచింగ్ గా ఉంటుంది.......
ఆగండాగండీ!
ఇక్కడ నేను ఆ సినిమా రివ్యూ రాయట్లేదు..సినిమాలు చూసి ఆనందించటమే కాని, రివ్యూలు రాసేంత టాలెంటు మనకి లేదు.....కనుక ఆ సినిమా, నాలో తట్టిలేపిన జ్ఞాపకాల్ని ఇక్కడ మీతో పంచుకుంటున్నా...

అక్కడ కథ మొత్తం తిరిగేది ముఖ్యంగా "ఆరో(AURO)" పాత్ర చుట్టూ....."పాపం పదమూడేళ్ళ కుఱ్రాడే" అని జాలేస్తుంది.....అలాంటి పిల్లాడు మనకి నిజజీవితంలో కనపడితే ఎలా ఉంటుందో కదా!

అవి నా ఫైనల్ ఇయర్ రోజులు....పీడియాట్రిక్స్ పోస్టింగ్స్! మమ్మల్ని ఎమర్జెన్సీ కేసులజోలికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు, బాగా కంఫర్టబుల్ గా ఉన్న కేసులే ప్రెజెంట్ చేసేవాళ్ళం...ప్రతిరోజూ దాదాపు కేస్ ప్రెజెంటేషన్ కి నన్నే ముందుకు తోసేవాళ్ళు మావాళ్ళు..సో రోజూ కేస్ తీసుకుంటూ,చిన్నపిల్లలతో కబుర్లతో సరదాగా గడిచిపోయేది....ఒకరోజు మా మాడమ్ instruction class చెప్పి," ఇవ్వాళ cardio vascular system(గుండె,రక్త ప్రసరణ వ్యవస్థ) కేస్ ప్రజంట్ చెయ్యండి. 2 unit లో 8th బెడ్ లో కేస్ ఉంది.one hourలో కేస్ తీసుకుని రెడీగా ఉండండి.డిస్కస్ చేద్దాం" అని చెప్పి వెళ్ళిపోయారు....అందరం భారంగా స్టెత్ లు మెళ్ళో వేసుకుని వార్డుకి బైల్దేరాం.....

నేను మాన్యువల్ చూసుకుంటూ మెల్లగా కారిడార్ లో నడుస్తూ వెళ్తున్నా....వార్డ్ కి ఎమర్జెన్సీరూమ్ మీదగా వెళ్ళాలి...ఎమర్జెన్సీకేస్ లు manage చెయ్యటం నాకు చాలా challenging గా ఉండేది..ఎప్పుడు అటుగా వెళ్ళినా ఒక లుక్కేసే వాణ్ణి... అప్పుడు,లోపల చూస్తే ఒకామె పిల్లవాణ్ణి ఎత్తుకుని, కళ్ళనీళ్ళు పెడుతూ కూర్చునుంది...ఒళ్ళో ఉన్న పిల్లవాణ్ణి చూడగానే నా కళ్ళు అక్కడే ఆగిపోయాయి...అప్రయత్నంగా నా కాళ్ళు అటుకేసి నడిచాయి......ఆ పిల్లవాణ్ణి చూడగానే నాకు కాసేపు ఏమీ అర్థం కాలేదు...బాగా ఎగశ్వాసగా ఉన్నాడు....హడావుడిగా వచ్చిన పీజీ మేడమ్, పిల్లవాణ్ణి ఎత్తుకెళుతూ నన్ను చూసి,"కౌటిల్యా! ఇక్కడేం పని.వార్డుకి వెళ్ళు"..అన్నారు..................నేను,"మాడమ్! ఈ కేసు......" అని ఆగిపోయా!.....మేడమ్,"PROGERIA(ప్రోజీరియా),A RARE GENETIC DISORDER.అయినా ఈ కేస్ మీకు అవసరంలేదులే...కావాలంటే ACUTE EPISODE తగ్గాక రేపు వచ్చి చూడు", అని చెప్పి హడావుడిగా వెళ్ళిపోయారు.....


"ప్రోజీరియా", ఈ మాటవిని ఆ పిల్లాడి వంక చూడగానే, ముందు చదివిందంతా గుర్తొచ్చింది......
"PROGERIA, A VERY RARE FORM OF GENETIC DISORDER....కోట్లల్లో ఒకళ్ళల్లో కనపడుతుంది....ప్రపంచం మొత్తంమీద ఇప్పటికి 30-40 cases మాత్రమే NOTE అయ్యాయి......ముఖ్య లక్షణాలు: failure to thrive(బరువు పెరగకపోవటం), macrocephaly with baldness that progesses to alopecia i.e. complete loss of hair and engorged veins(పెద్దతల.ముందు బట్టతలతో తర్వాత తర్వాత జుట్టు మొత్తం రాలిపోతుంది, కనుబొమలతో సహా...తల మీద నరాలు ఉబ్బి ఉంటాయి)...pinched nose, pegged teeth(నొక్కుకున్నట్టుండే ముక్కు, రాలిపోయిన పళ్ళు).....early starting of aging process..(ఐదేళ్ళకే యాభయ్యేళ్ళ రూపం)....ALTERED AND KERATINISED SKIN TEXTURE(ఎండిపోయినట్టుండే చర్మం).....కాని normal mental and behavioural development...అంటే మనసుకంటే శరీరం ఓ పదిరెట్ల వేగంతో తన వయసుని పెంచేసుకుంటుంది....ఆరోగ్యం కూడా అలానే పెద్దవయసుదై పోతుంటుంది....fragile body, repeated fractures and joint dislocations....ముఖ్యంగా గుండె, రక్త ప్రసరణ వ్యవస్థ బాగా దెబ్బతింటాయి....repeated heart strokes....ఎవ్వరూ పదమూడు, పద్నాలుగేళ్ళకన్నా బతకరు...no treatment and prevention measures till date(వైద్యం కాని, నివారణ కాని లేదు)"

ఈ వాక్యాలు, మనసులో మెదులుతుంటే భారంగా వార్డ్ వైపు అడుగులేశా....మా వాళ్ళు హడావుడిగా "ఎమర్జెన్సీ తర్వాత డీల్ చేద్దురు డాక్టర్ గారూ!ముందు వచ్చి ఈ కేస్ సంగతి చూడండి"..అన్నారు..."నాకు ఇవ్వాళ మూడ్ లేదురా" అని పుస్తకంలో తల దూర్చేశా...అది గమనించిన సుబ్బు,"కేస్ నే తీసుకుంటాగాని, ఏమైంది నీకు?ఇప్పటిదాకా బానే ఉన్నావుగా" అని అడిగాడు..."ఏం లేదురా" అని మళ్ళా తల దించేశా....కళ్ళు లైన్ల వెంట పరిగెడుతున్నా, మనసుకి మాత్రం ఏదో ఉద్వేగం, బాధ...కళ్ళ ముందు ఆ పిల్లాడి ముఖమే మెదులుతుంది....తర్వాత క్లాసులో కూడా......

తర్వాత రోజు ఉదయం, ఓ గంట ముందు హాస్పటల్ కి వెళ్ళిపోయా....నన్ను చూడగానే పీజీ మేడమ్"అనుకున్నా, నువ్వు వస్తావని" అని కేస్ గురించి చెప్పటం మొదలెట్టారు....ఎప్పుడైనా మంచి కేస్ ఉంటే ముందుగా వచ్చి, వాళ్ళని చావగొట్టే నేను, ఆ పిల్లాణ్ణి చూట్టానికి వచ్చా అని ఎలా చెప్పగలను?? నేను మాత్రం ఆ పిల్లాణ్ణి చూస్తూ అలానే ఉండిపోయా! మేడమ్ చివరగా ముగిస్తూ,"ఇది చాలా rare case కౌటిల్యా! ఈ 25yrs లో ఎప్పుడూ రాలేదు.దేశం మొత్తంమీద ఒక ఇరవై ఉంటాయేమో!" అని చెప్పి వెళ్ళిపోయారు.....ఇంకొకప్పుడైతే,"YES! MINE IS BEST COLLEGE..మాలాటి క్లినికల్ మెటీరియల్ ఏ కాలేజ్ లో దొరకదు." అని చంకలు గుద్దుకుంటూ ఆనందపడే వాణ్ణి...కాని మచ్చుక్కూడా ఆ ఫీలింగ్ కలగలా! అలానే ఆ పిల్లాణ్ణి చూస్తూ ఉండిపోయా!

పైగా, "పా" సినిమాలో "ఆరో"ది fair complexion...అందువల్ల అంత వికృతంగా అనిపించదు("పా" రెండేళ్ళ తర్వాత వచ్చింది)....కాని ఈ పిల్లాడు complete dark complexion, పైగా బీదకుటుంబం కావటం వల్ల పోషణ సరిగ్గా లేకపోవటం, మరీ వికృతంగా ఉన్నాడు...just a monster...స్పెసిమన్స్ గా, లైవ్ గా చాలా monster babies ని చూసినా ఎప్పుడూ ఇలాంటి ఫీలింగ్ కలగలా! ఏదో ఇది అని తెలియకుండా, మనసుని మెలిపెడుతున్న ఫీలింగ్!!! "డాక్ట్రర్లు, పేషెంట్ బాధని మనసుకి తీసుకోకూడదు.తీసుకుంటే వైద్యం చెయ్యలేరు" అన్న principle ని ఖచ్చితంగా పాటించేవాణ్ణి, నేను..ఎన్ని హృదయ విదారకమైన దృశ్యాలు చూసినా చలించని నా మనసుని, ఉద్వేగ పడకుండా ఆ నిమిషం పట్టుకోలేకపోయా!మేడమ్ వెళ్ళగానే ఆ పిల్లాడి తల్లి ఏడుస్తూ"డాక్టర్ గారూ! ముందంతా బానే ఉన్నాడండీ..రెండేళ్ళప్పటినుంచి మొదలైంది...మెల్ల మెల్లగా ఇలా ఐపొయాడు...మొదట్లో ఎవ్వరికీ చూపించకుండా దాచుకుంటూ వచ్చా! కాని వాడికీ అందర్లా ఆడుకోవాలనీ,బడికెళ్ళాలనీ ఉంటదిగా! తోటి పిల్లలందరూ"తాతా, తాతా" అని ఏడిపిస్తున్నారని చెప్తే వాడి బాధ ఎలా తీర్చాలో నాకు చేతగావటం లేదు సారూ! మా వాడు మామూలుగా అవుతాడా!"....అని ఆ తల్లి అడుగుతుంటే, ఏం చెప్పాలో అర్థంకాలేదు.. భాధతో గొంతు పూడుకుపోయింది....మేడమ్ వాళ్ళు అంతా చెప్పేఉంటారు కదా! అయినా ఆ పిచ్చితల్లి, నేనేమన్నా positiveగా చెప్తానేమో అని ఆశతో అడుగుతుంటే, ఏం చెప్పాలో అర్థంకాక, నాకు తెలిసిన డైట్ ADVICE(high calorie diet is the main stay of management) చెప్పి
వెళ్ళిపోతూ ఒక్కసారి ఆ పిల్లాడి వంక చూశా.......

అలానే నా వంక చూస్తున్న ఆ ఏడేళ్ళ పిల్లాడి కళ్ళల్లో, ఏదో తెలియని నిర్వేదం...ఒక వైరాగ్యం లాంటి భావన..."మీ అందరికంటే అప్పుడే నేను పెద్దవాణ్ణైపోయాగా" అని చెప్తున్నట్టున్న ఆ చూపులు............గుర్తొచ్చినప్పుడల్లా ఒక్కసారి మనసుని కుదిపేస్తాయి...


21, సెప్టెంబర్ 2010, మంగళవారం

మీ సమస్యలు..నా సలహాలు


"ఆరోగ్యమే మహాభాగ్యం"....ఈ సూక్తిని ఏదో ఊరికే నేర్చుకున్నా, నా అనుభవంలోకి వచ్చాకే అది బాగా అర్థమవుతోంది......ఇన్నాళ్ళ నా వైద్యుడి జీవితం నాకు ఆ సూక్తికి అసలు రూపాన్ని చూపించింది....ఇప్పుడు ఏ పేషెంటుని చూసినా అదే ప్రతిక్షణం మనసుకి తగులుతూ ఉంటుంది...... డాక్టర్ గా కాక, ఒక మామూలు వ్యక్తిగా ఫీల్ అయ్యి, ఒక పేషెంటుగానో, లేక అటెండెంట్ గానో ఉన్నప్పుడు ఈ విషయం ఇంకా బాగా అర్థమవుతోంది....

ఎంతోమందిని చూస్తుంటాను! కొత్తవాళ్ళైనా, "డాక్టర్ని" అని చెప్పగానే, వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళబోసుకుంటుంటారు....సరైన గైడెన్స్ లేక వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడిందీ,పడుతుందీ చెప్తుంటారు...... నా సన్నిహితులు,బంధువులు ఎప్పుడు వాళ్ళకి ఏ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా, ఫోన్ చేసి అడుగుతుంటే, "వీళ్ళకైతే నేను చెబుతున్నాను! మిగతా వాళ్ళంతా ఎలానో కదా!" అని అనిపించేది...బ్లాగు సోదరి గారు "యాంటీబయాటిక్స్" గురించి అనుమానం అడిగినప్పుడు ఆ ఆలోచన మరింత బలపడింది.....ఈ మధ్య నాకు ఎదురైన కొన్ని అనుభవాలు ఆ ఆలోచనని మరికాస్త ముందుకు నెట్టాయి...అందరికీ ఈ దిశగా కొంత ఉపయోగపడాలన్న నా ఆలోచనలకి కార్యరూపమే ఈ బ్లాగు......

పైగా ఈ కాలపు డాక్టర్లన్నా,వాళ్ళ వైద్యమన్నా ఎవరికీ సరిగ్గా నమ్మకం ఉండట్లేదు,మన మీడియా ప్రభావమేమో!....."డబ్బులకోసమే అంతా చేస్తుంటారు,ఇన్ని టెస్టులు ఎందుకు చేస్తారో అర్థంకాదు" అనుకుంటుంటారు.....దానికి కొంత వరకి మా డాక్ట్రర్లే కారణం....పేషెంట్ కి అర్థమయ్యే రీతిలో చెప్పలేక పోవటం ఒక కారణమైతే, రెండవది అందుకు సరైన సమయాన్ని కేటాయించలేక పోవడం......అందరికీ సాధారణంగా వచ్చే ఈ అనుమానాలకి ఎలా సమాధానం ఇవ్వాలా అనుకుంటున్నపుడు నాకు తట్టిన ఆలోచనే ఈ నా"వైద్యశాస్త్రం"......
పైగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకి డాక్టర్ దగ్గరికి పరిగెట్టి గంటలు గంటలు వెయిట్ చేసి,చివరికి ఓ పెద్ద మందులచీటీ చేత్తో పట్టుకుని రావాలంటే మధ్యతరగతివాళ్ళకి అన్నిరకాలుగా భారమైన పని....అలా అని పూర్తిగా లైట్ తీసుకున్నా ప్రమాదమే....కాబట్టి దానిక్కావాల్సింది సరైన గైడెన్స్ అనిపించింది.....అందుకే ఈ "వైద్యశాస్త్రం" తో మీ ముందుకు వస్తున్నాను........

మీకు ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలున్నా నాకు మెయిల్ చెయ్యండి.....మీ సమస్యలకి నా సలహాలని ఈ బ్లాగు ముఖంగా తెలియజేస్తాను..అది మిగతావారిక్కూడా ఉపయోగకరంగా ఉంటుంది.........ఇంకో ముఖ్యమైన విషయం....ఇక్కడ మీ సమస్యలకి సలహాలని మాత్రమే చెప్పి, మీకు సరైన గైడెన్స్ ఇవ్వటం మాత్రమే ముఖ్య ఉద్దేశ్యం...అంతేకాని, డైరెక్ట్ గా ఎలాంటి వైద్యమూ చెప్పటం జరగదని మనవి......

నా మెయిల్ ఐడీ :- choudary.koutilya90@gmail.com

ధన్యవాదాలు